భర్త హత్యకు సుపారీ.. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్..
- అడ్డంగా దొరికిపోయిన భార్య..
- యువ వైద్యుడి హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు
అక్షరదర్బార్, వరంగల్: వరంగల్‌లో యువ వైద్యుడిపై హత్యాయత్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. డాక్టర్ భార్యే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసినట్లు నిర్దారించారు. నిందితులైన గాదె ఫ్లోరా మరియా (వరంగల్), ఆమె ప్రియుడు ఏర్రోళ్ల శామ్యూల్ (సంగారెడ్డి), వారికి సహకరించిన ఏఆర్ కానిస్టేబుల్ మంచుకురి రాజ్ కుమార్ (సంగారెడ్డి)ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
అసలేం జరిగింది
వరంగల్‌లకు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డికి ఫ్లోరా మరియాతో 2016 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. 2018లో సంగారెడ్డి లో సుమంత్ రెడ్డి బంధువుల విద్యాసంస్థలు ఉండగా వాటిని చూసుకోవడం కోసం అతని భార్య ఫ్లోరా మరియా, డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. అక్కడ డాక్టర్ సుమంత్ రెడ్డి సంగారెడ్డి PHC లో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తన భార్య ఫ్లోరా మరియా స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుండేది. బరువు తగ్గడానికి ఆమె సంగారెడ్డిలోని సిద్దు జిమ్ సెంటర్ కి వెళ్తుండేది. జిమ్ సెంటర్లో కోచ్ గా పని చేస్తున్న ఏర్రోల్ల శామ్యూల్ పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం డాక్టర్ సుమంత్ రెడ్డికి తెలవగా భార్యా భర్తలకు గొడవలు జరిగేవి. ఇట్టి గొడవల కారణంగా డాక్టర్ సుమంత్ రెడ్డి అక్కడి నుండి తన ఫ్యామిలీని వరంగల్‌కి షిఫ్ట్ చేశారు. 2019 సంవత్సరంలో ఫ్లోరా మరియా లెక్చరర్ ఉద్యోగం పొంది జనగామ జిల్లాలోని పెంబర్తి సోషల్ వెల్ఫేర్ కాలేజీలో విధులు నిర్వ్‌హిస్తూ అక్కడే వుండేవారు. తర్వాత కాలేజ్ వరంగల్ లోని రంగశాయిపేట్ మారడంతో డాక్టర్ సుమంత్ రెడ్డి వరంగల్‌లోని వాసవి కాలనీలో ఉంటూ కాజీపేటలో ప్రైవేట్ హాస్పిటల్ నడుపుకుంటూ ఉదయం వెళ్లి రాత్రి తన ఇంటికి వస్తుండేవాడు.
ఫ్లోరా మరియా మాత్రం సంగారెడ్డిలో పరిచయమై వివాహేతర సంబంధం పెట్టుకున్న శామ్యూల్‌తో తరచుగా ఫోన్లు మాట్లాడడం వీడియో కాల్స్ మాట్లాడడం డాక్టర్ సుమంత్ రెడ్డి లేని సమయంలో సదరు శామ్యూల్ ని ఇంటికి పిలిపించుకొని అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఉండేది. ఇది తెలుసుకున్న డాక్టర్ సుమంత్ రెడ్డి ఆమెను మందలించేవారు. ఈ విషయం లో వారిద్దరి మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఫ్లోరా మరియా, శామ్యూల్ లు డాక్టర్ సుమంత్ రెడ్డిని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. శామ్యూల్ ఈ విషయాన్ని స్నేహితుడైన ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్‌కు చెప్పాడు. డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యకి సహకరిస్తే సంగారెడ్డిలో ఇంటిని నిర్మించి ఇస్తానని చెప్పగా దానికి సదరు హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ఒప్పుకొన్నాడు.
15 రోజుల క్రితం లక్ష రూపాయలు ఫ్లోరా మరియా, శామ్యూల్‌కి ట్రాన్స్ఫర్ చెయ్యగా అందులో నుండి ఖర్చులకు రూ. 50 వేల రూపాయలు శామ్యూల్ తీసుకోని, మిగిలిన 50 వేల రూపాయలు శామ్యూల్ AR హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్‌కి ఇచ్చాడు. ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం సంగారెడ్డిలో సుత్తిని కొనుగోలు చేసి రాజకుమార్ రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై బయలుదేరి కాజీపేటకు వచ్చి ముందుగా వారు అనుకున్న ప్రకారం డాక్టర్ సుమంత్ రెడ్డిని హత్యచేసేందుకు సీసీ కెమెరాలు, జనసంచారం లేని చీకటి ప్రదేశాన్ని ఎంచుకొన్నారు. సుమంత్ రెడ్డి రాత్రి తన క్లినిక్ ముగించుకొని కారులో బట్టుపల్లి రోడ్డు నుండి రంగాశాయపేట వెళ్తున్న క్రమంలో వెనుక ఫాలో అయ్యి బట్టుపల్లి శివారులో డాక్టర్ సుమంత్ రెడ్డి కారును పక్కకు శామ్యూల్, రాజ్‌కుమార్ విచక్షణారహితంగా కొట్టి, గాయపర్చారు. చనిపోయాడనుకొని భావించి అక్కడి నుండి వారు పారిపోయారు. డాక్టర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ కేసును వరంగల్ ఏసీపీ నంది రామ్ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ వెంకట్రత్నం దర్యాప్తు చేసి ప్రత్యక బృందాలుగా ఏర్పడి నిందితులను అరెస్ట్ చేశారు.