గిరిజన యువకుడిపై పెద్దవంగర ఎస్సై క్రాంతి కుమార్ దాష్టీకం
- లంచం ఇవ్వలేదని పోలీస్‌స్టేషన్‌లో చితకబాదిన వైనం
- పోలీస్ వాహనంలోనే దవాఖానకు తరలించిన సిబ్బంది
- హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితుడు
అక్షర దర్బార్, తొర్రూరు : అడిగినంత లంచం ఇవ్వకపోవడంతో ఎస్సై ఓ యువకుడిని చితకబాదాడు. ఈ ఘటన శనివారంరాత్రి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం...పెద్దవంగర మండలం శంకర్ తండాకు చెందిన అనూషకు కేసముద్రం మండలం చప్పుడిగుట్ట తండాకు చెందిన బానోత్ రాజేష్‌తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దమనుషుల తీర్మానంతో రాజేష్ ఆస్తిని భార్యకు రాసిచ్చాడు. అయినా అనూష కేసుపెట్టింది. కేసులో రాజేష్‌ను ఎస్సై క్రాంతికుమార్ రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా, రూ.15,000 ఇచ్చాడు. మరో 20 వేలు ఇవ్వాలని ఎస్సై ఒత్తిడి చేయగా, డబ్బులు లేవని రాజేష్ చెప్పడంతో కోపంతో పోలీస్ స్టేషన్‌కు పిలిపించుకొని ఎస్సై , సిబ్బంది చితకబాదారు. గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ వాహనంలో తీసుకొని తొర్రూరులోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించి వెళ్ళిపోయారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చాడు.