మేడారంలో బైక్ అంబులెన్స్
21 రకాల వస్తువులతో కిట్
మహా జాతరలో తొలిసారి
ప్రారంభించిన మంత్రి సీతక్క
అక్షర దర్బార్, మేడారం:
తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం ప్రభుత్వం తొలిసారి బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాడ్వాయి మండలంలోని మేడారంలో ఈ నెల 21 నుంచి 24 వరకు సమ్మక్క సారక్క జాతర జరగనున్న విషయం తెలిసిందే. కోటి మందికి పైగా భక్తులు సందర్శించే మేడారం జాతర కోసం శనివారం మేడారం గిరిజన మ్యూజియంలో బైక్ అంబులెన్స్ లను రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, హెల్త్ కమిషనర్ ఆర్ వి కర్ణన్, ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రత్యేక అధికారులు ఎస్. కృష్ణ ఆదిత్య, రాధిక గుప్త, ప్రతిమ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతర లో భక్తుల రద్దీ పెరుగుతుందని, ఆపద సమయంలో భక్తులకు సేవలు అందించడానికి నూతనంగా బైక్ అంబులెన్స్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జాతరలో 40 బైక్ అంబులెన్స్ లు ఏర్పాటు చేశామని, ఇందులో 21 రకాల వస్తువుల కిట్ ద్వారా భక్తులకు వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా రద్దీ ఉండే ప్రాంతాలలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులూ పడకుండా సమన్వయం తో దేవతల దర్శనం చేసుకోవాలని ఆపద సమయంలో సేవలు అందించే అంబులెన్స్ కి దారి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా వైద్య అధికారి ఆలెం అప్పయ్య ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.