కమలంలో కదనోత్సహం
- బలాన్ని పెంచుకుంటున్న బీజేపీ
- బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు
- ఇప్పటికే పలువురు ముఖ్యుల చేరిక
- మానుకోటలో మాజీ ఎంపీ, వరంగల్ లో మాజీ ఎమ్మెల్యే
- బీజేపీలో చేరాక పార్టీ ముఖ్యలను కలుస్తున్న అల్లూరి
- బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలకు రమేష్ ప్లాన్
- అరూరిని వరంగల్ అభ్యర్థిగా ప్రకటించనున్న బీజేపీ
- రమేష్ బీజేపీలో చేరనున్నట్లు ముందే 'అక్షరదర్బార్' పత్రికలో కథనం
అక్షర దర్బార్, వరంగల్: తెలంగాణలో బలాన్ని పెంచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ లోక్ సభ మెజారిటీ స్థానాలను గెలుచుకోవటమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలను బరిలోకి పార్లమెంటు ఎన్నికల బరిలో దింపే పనిలో ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలకు ఆఫర్ ఇస్తుంది. కారు దిగి కమలం పార్టీలో చేరిన నేతలకు పలువురికి ఈ ఎన్నికల్లో అభ్యర్థిత్వం కేటాయిస్తుంది. ఫలితంగా బీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ ఎంపీలతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కాషాయం తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ను జహీరాబాద్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు తనయుడు భరత్ ను నాగర్ కర్నూల్ స్థానం నుంచి బీజేపీ అధిష్టానం తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ ఎంపీలు జి నగేష్ ను ఆదిలాబాద్, పోరిక సీతారాం నాయక్ ను మహబూబాబాద్, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని నల్గొండ లోక్ సభ స్థానం నుంచి రెండో జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించింది. వరంగల్, ఖమ్మం స్థానాలను మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది. వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోసం వరంగల్ స్థానం ఆపినట్లు ప్రచారంలో ఉంది. కారు దిగిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివారం బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో కమల దళంలో చేరారు. అరూరి బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరనున్నట్లు 'అక్షరదర్బార్' పత్రికలో ముందుగానే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆరూరి రమేష్ తో పాటు వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ నేతలు పలువురు కమలం కండువా కప్పుకున్నారు. వీరిలో బీఆర్ఎస్ పర్వతగిరి మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు.
- ముఖ్య నేతల వద్దకు..
బీజేపీలో చేరిన ఆరూరి రమేష్ ఆ పార్టీ ముఖ్య నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఆదివారం బీజేపీలో కీలకపాత్ర పోషిస్తున్న లక్ష్మణ్, మురళీధర్ రావు, చంద్రశేఖర్ తదితరులను కలిశారు. ఆరూరి వెంట వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కొండేటి శ్రీధర్, జలగం రంజిత్ రావు తదితరులు ఉన్నారు. ఆరూరి రమేష్ ను వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నేడో రేపో ఆ పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. మాజీ ఎంపీ పోరిక సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వంటి నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమల దళంలో కథనోత్సవం కనపడుతుంది. బీజేపీకి ఇక్కడ మరింత బలం పెరిగినట్లు కమలనాథులు భావిస్తున్నారు. అరూరి రమేష్ సమక్షంలో వర్ధన్నపేట నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.