కాంగ్రెస్ లో చేరిన కడియం
- శ్రీహరితో పాటు కావ్య కూడా చేరిక
- దీపా దాస్ మున్షి, సీఎం రేవంత్ సమక్షంలో..
- హస్తం కండువా కప్పుకున్న తండ్రి, కూతురు
- కడియం కాంగ్రెస్ లోకి రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన
అక్షర దర్బార్, వరంగల్: అందరూ ఊహించినట్టుగానే స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, రాష్ట్ర ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి సమక్షంలో తండ్రి, కూతురు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కడియం శ్రీహరి, కావ్యను దీపా దాసు మున్షి, సీఎం రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పోషించిన కడియం శ్రీహరి కూతురైన కావ్యకు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించడం, మూడు రోజుల క్రితం కడియం కావ్య తాను విరమించుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి హైదరాబాదులో కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి శ్రీహరి, కావ్యతో సమావేశమై తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కడియం శ్రీహరి, కావ్య హస్తం పార్టీలో చేరారు. కారు దిగిన కడియం కావ్యను కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరి చేరికను వ్యతిరేకిస్తూ మాదిగలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆదివారం ఎమ్మార్పీఎస్ కార్యకర్త ఒకరు ధర్మసాగర్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది.