కాంగ్రెస్ లో ఫ్లెక్సీ వార్!
- ఫ్లెక్సీ ఏర్పాటు పై కాంగ్రెస్ లో వివాదం
- ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేదని ఘర్షణ
- కొండ వర్గీయులు దాడి చేశారని ఫిర్యాదు
- కొందరిని అదుపులోకి తీసుకున్న గీసుకొండ పోలీసులు
- నిరసనగా ధర్మారం వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో
- గీసుకొండ పోలీస్ స్టేషన్ చేరుకున్న మంత్రి సురేఖ
- డిసిపి, ఏసిపి, సీఐని రిలీవ్ చేయాలని డిమాండ్
- స్టేషన్ లో సిఐ సీట్లో కూర్చున్న మంత్రి సురేఖ
- మంత్రితో మాట్లాడిన సిపి అంబర్ కిషోర్ ఝా
అక్షరదర్బార్, గీసుకొండ:
పరకాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో అధికార పార్టీలో వర్గ పోరు రోజురోజుకు ముదురుతుంది. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు వర్గాల మధ్య వార్ నడుస్తుంది. కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే రేవూరి, మంత్రి కొండా సురేఖ మధ్య ఫోన్ లో జరిగిన వాగ్వాదం ఆడియో ఒకటి వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎమ్మెల్యే రేవూరి, మంత్రి సురేఖ వర్గాల మధ్య వివిధ సందర్భాల్లో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని గీసుకొండ మండలం ధర్మారం వద్ద వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇరు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధర్మారంలో కొండా వర్గీయులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ఫోటో లేదని ఆయన వర్గీయులు పేర్కొనడం, తర్వాత ఇక్కడ ఫ్లెక్సీ ధ్వంసం కావడంతో శనివారం రేవూరి, కొండా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తనపై ఆరుగురు వ్యక్తులు దాడి చేశారని ధర్మారంలోని కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ప్రత్యర్థి వర్గానికి చెందిన కాంగ్రెస్ లోని ఆరుగురు కార్యకర్తలపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనగా కొండా వర్గీయులు ఆదివారం ఆందోళనకు దిగారు.
- దర్మారంలో రాస్తారోకో
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని విడిచి పెట్టాలనే డిమాండ్ తో ధర్మారం వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులకు, రాస్తారోకోలో పాల్గొన్న వారికి మధ్య జరిగింది. ఈ క్రమంలో మంత్రి సురేఖ నేరుగా ధర్మారం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ఒక ఆటోలో గీసుకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిపై చేయి చేసుకున్న డిసిపి, ఏసిపి, ఇన్ స్పెక్టర్ ను విధుల నుంచి రిలీవ్ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. సమాచారం తెలియగానే కొండా వర్గీయులు వివిధ గ్రామాల నుంచి గీసుకొండ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దీంతో కొద్దిసేపు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ అర్బన్ అంబర్ కిషోర్ ఝా గీసుకొండ పోలీస్ స్టేషన్ చేరుకొని మంత్రితో మాట్లాడారు. కొద్దిసేపటి తర్వాత మంత్రి సురేఖ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే రేవూరి వర్సెస్ కొండా వర్గీయుల మధ్య జరుగుతున్న వార్ ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది