ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత జగన్ హతం
- స్వస్థలం టేకులగూడెంలో విషాదఛాయలు
- 1980వ సంవత్సరంలో పీపుల్స్‌వార్‌లో చేరిక
- అంచెలంచెలుగా కేంద కమిటీ స్థాయికి..
అక్షరదర్బార్, వరంగల్ : మావోయిస్టు అగ్రనేత, పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ దాదా రణదేవ్ ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. కేంద్ర మిలిటరీ ఇంచార్జ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ బార్డర్ ఇన్చార్జిగా కొనసాగుతున్న రణదేవ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం. 1980వ సంవత్సరంలో పీపుల్స్‌వార్‌లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. కేంద్ర కమిటీలో కీలకస్థాయికి చేరుకున్నారు. బీజాపూర్, దంతెవాడ సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో రణదేవ్ మృతి చెందినట్లుగా దంతవాడ ఎస్పీ బుధవారం తెలిపారు. రణదేవ్ భార్య మాచర్ల లక్ష్మక్క గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. రణదేవ్ మరణంతో ఆయన స్వస్థలం టేకులగూడెంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి టేకులగూడెంకు ఆయన మృతదేహాన్ని తీసుకువస్తున్నట్లు సమాచారం.