వాగులో గల్లంతైన మోతీలాల్ మృతదేహం లభ్యం..
- తండ్రీ కూతురుని మింగిన ఆకేరు
- కుటుంబంలో తీరని విషాధాన్ని మిగిల్చిన వర్షం
అక్షరదర్బార్, మహబూబాబాద్: మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరు వాగులో గల్లంతైన నూనావత్ మోతీలాల్ మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో తండ్రీకూతురు గల్లంతైన విషయం తెలిసిందే. సాయంత్రం బిడ్డ అశ్విని మృతదేహం లభ్యంకాగా, నేడు తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంకాగా, స్థానికులను కంటతడిపెట్టించింది.
బిడ్డ అశ్వినిని శంషాబాద్ విమానాశ్రయంలో దింపేందుకు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి శివారు గంగారంతండా నుండి నిన్న తెల్లవారుజామున కారును తానే నడుపుతూ ఆనందంగా బయలుదేరాడు మోతిలాల్.. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం బ్రిడ్జిపైనుంచి ఆకేరు వాగు ఉధృతంగా పోతుండటంతో వరద తీవ్రతను గుర్తించక అలాగే ముందుకెళ్లాడు. దీంతో వారు ప్రయాణిస్తున్న కారు వాగులో కొట్టుకుపోయింది. తాము వాగులో పడిపోయామని, మెడలోతు నీళ్ళలో ఉన్నామని బోరున విలపిస్తూ సమీప బంధువులకు ఫోన్ చేశారు తండ్రీకూతురు.. ఒక్కసారిగా అధికారులు, మీడియా అప్రమత్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, రెస్య్కూ టీం సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం అశ్విని మృతదేహాన్ని బయటకు తీయగా, ఇవాళ మోతీలాల్ మృతదేహం లభ్యమైంది. గల్లంతైన కారును వాగునుంచి బయటకు తీశారు. ప్రయాణం సాఫీగా సాగితే నిన్న సాయంత్రం శంషాబాద్ నుండి విమానంలో బయలుదేరి ఈరోజు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో జాతీయస్థాయి సైన్స్ సెమినార్‌లో యువ శాస్త్రవేత్త అశ్విని ప్రసంగించాల్సి ఉంది. కానీ ఊహకందని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాధాన్ని మిగిల్చింది. రెండు నిండు ప్రాణాలను మింగేసింది. ఎంతో గొప్ప భవిష్యత్ ఉన్న యువ శాస్త్రవేత్త అశ్విని అకాల మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.