పసికందు అపహరణ!
- ట్రీట్మెంట్ కోసం బిడ్డతో వచ్చిన తల్లి
- హాస్పిటల్లో బిడ్డను ఎత్తుకెళ్లిన ఓ మహిళ
- సీసీ కెమెరాల ద్వారా కిలాడీని గుర్తించే పనిలో పోలీసులు
అక్షరదర్బార్, వరంగల్:
వరంగల్ లోని సీకేఎం హాస్పిటల్ లో మరోసారి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది. ఇవాళ సీకేఎం హాస్పిటల్ లో ఓ పసికందు కిడ్నాప్ జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ నాలుగు రోజుల క్రితం మంచిర్యాలలోని ఓ హాస్పిటల్ లో మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ఏడు నెలలకే డెలివరీ కావడంతో పుట్టిన మగ బిడ్డకు మెరుగైన వైద్యం కావాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో తల్లి ఓ మహిళ సహాయంతో ఆదివారం ఉదయం వరంగల్ కు చేరుకుంది. వెంట ఉన్న మహిళ మెరుగైన ట్రీట్మెంట్ లభిస్తుందని సీకేఎం హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే హాస్పిటల్ లో తల్లి, బిడ్డను అడ్మిట్ చేయలేదు. రికార్డులు ఎక్కడ కూడా వారి పేర్లను నమోదు చేయలేదు. సీకేఎం హాస్పిటల్ లోని పీడియాట్రిక్ విభాగం వద్ద ట్రీట్మెంట్ పేరుతో తల్లిని మాటల్లో పెట్టిన ఓ మహిళ పసికందును తన వెంట తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. ఎంతకీ సదరు మహిళా తిరిగి రాకపోవడం, తన బిడ్డ కనపడకపోవడంతో బాధితురాలు తల్లి విలపిస్తుండగా హాస్పిటల్ వర్గాల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత బాధితురాలు వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు సీకేఎం హాస్పిటల్ ను సందర్శించి పసికందు కిడ్నాప్ కిడ్నాప్ పై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సీకేఎం హాస్పిటల్ లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించటం ద్వారా పసికందును అపహరించిన మహిళను గుర్తించి పట్టుకునే పని పోలీసులు ఉన్నట్లు తెలిసింది. సీకేఎం హాస్పిటల్ లో పసికందు అపహరణను ధ్రువీకరించిన పోలీసులు కిడ్నాప్ నకు పాల్పడింది ఎవరనేది ఇంకా వెల్లడించలేదు.