రైటర్ హర్ట్... సీన్ రివర్స్!
- కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది అక్రమార్జనకు ప్రాధాన్యం
- విధుల నిర్వహణలో అందినకాడికి దండుకుంటున్న వైనం
- తాజాగా ఓ యాక్సిడెంట్ కేసులో డ్రైవర్ చేంజ్
- రైటర్ తీరుతో బయటపడిన వ్యవహారం
- హైవేలో గల ఓ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
- ప్రభుత్వ నిఘా వర్గాల ఆరా
అక్షర దర్బార్, నిఘా విభాగం:
పోలీసు శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది కాసుల సేకరణే కర్తవ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్జన కోసం మార్గాలను వెతుకుతున్నారు. విధుల నిర్వహణలో అందిన కాడికి దండుకుంటున్నారు. వివిధ కేసుల్లో సాధ్యమైనంతవరకు డబ్బు గుంజడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇల్లీగల్ కలెక్షన్స్ లో పోటీ పడుతున్నారు. తాజాగా ఓ పోలీసు స్టేషన్ లో జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతుంది. ఓ యాక్సిడెంట్ కేసులో డ్రైవర్ ను మార్చినందుకు స్టేషన్ అధికారులు ఆర్థిక లబ్దితో సంతృప్తి పడ్డారు. అయితే తనను చిన్న చూపు చూశారని ఠాణా రైటర్ హర్ట్ అయ్యారు. ఇంకేముంది సీన్ రివర్స్ అయ్యింది. జరిగిన భాగోతం బయటకు వచ్చింది. దీంతో చివరకు పోలీసులు అసలు డ్రైవర్ ను కేసులోకి తెచ్చి గప్ చుప్ అయ్యారు.
- ఏం జరిగిందంటే...
ప్రభుత్వ నిఘా వర్గాలకు అందిన సమాచారం ప్రకారం... ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక కుటుంబం కారులో ములుగు జిల్లాలోని ఓ ఆలయాన్ని సందర్శించింది. దర్శనం అనంతరం సాయంత్రం కారులో యాదాద్రి భువనగిరి జిల్లాకు బయలుదేరింది. వరంగల్ నగరానికి చేరుకోకముందే జాతీయ రహదారిలో ఓ గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందగా కొందరు గాయపడ్డారు. స్థానిక పోలీసులు విచారణ జరిపి లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. అయితే భూపాలపల్లి జిల్లాకు చెందిన ఈ లారీ వెంట ఆ సమయంలో ఉన్న డ్రైవర్ కు లైసెన్స్ లేదు. అతనే లారీ ఓనర్ కూడా. ఈయనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. దీనిపై మధ్యవర్తుల చొరవతో స్థానిక పోలీసు స్టేషన్ అధికారులకు, లారీ డ్రైవర్ కమ్ ఓనర్ మధ్య మొదట ఓ అవగాహన కుదిరింది. దీంతో లారీ ఓనర్ సూచించిన లైసెన్స్ గల మరో డ్రైవర్ పేరును పోలీస్ అధికారులు ఈ కేసులో చేర్చినట్లు తెలిసింది. ఆ తర్వాత లారీ రిలీజ్ కోసం పోలీసు అధికారులు రవాణా శాఖ వద్దకు పంపారు. ఇందుకు ప్రతిఫలంగా ఓ అధికారికి రూ.30 వేలు, ఇంకో అధికారికి రూ.12 వేలు ముట్టినట్లు ప్రచారంలో ఉంది.
- తర్వాత ఏమైందంటే...
- లారీ ఓనరు రవాణా శాఖ నుంచి రిలీజ్ ఆర్డర్ పొందాక దీన్ని తీసుకుని లైసెన్స్ డ్రైవర్ యాక్సిడెంట్ జరిగిన సంబంధిత పోలీస్ స్టేషన్ రైటర్ ను కలిశాడు. అప్పటికే ఈ స్టేషన్ కు చెందిన అధికారుల్లో ఇద్దరికి డబ్బు ముట్టిందనేది ప్రచారంలోకి రావడంతో ఈ విషయమై రైటర్ సదరు డ్రైవర్ వద్ద ప్రస్తావించి ఆర్థికపరంగా తనను చిన్నచూపు చూస్తున్నట్లుందని గరం అయ్యాడని తెలిసింది. ఈ డ్రైవర్ భయంతో డ్రైవర్ మార్పు జరిగిన విషయం బయట పెట్టాడు. ఇది వెలుగులోకి రావడంతో అప్పటికే ఆర్థిక లబ్ధి పొందిన స్టేషన్ అధికారులు సైతం చివరకు ఈ యాక్సిడెంట్ సమయంలో లారీ వెంట ఉన్న లైసెన్స్ లేని డ్రైవర్ కమ్ ఓనర్ పేరును కేసులో చేర్చాల్సి వచ్చింది. సదరు డ్రైవర్ కమ్ ఓనర్ ఆ తర్వాత తన లారీ రిలీజ్ కోసం రవాణా శాఖ నుంచి మరో రిలీజ్ ఆర్డర్ పొందాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్సు లేని తన స్థానంలో లైసెన్స్ గల మరో డ్రైవర్ పేరును కేసులో చేర్చడానికి ఖర్చు పెట్టుకున్నా తీరా ఫలితం లేకుండా పోవడంతో లారీ డ్రైవర్ కమ్ ఓనర్ ఆఖరుకు స్టేషన్ బెయిల్ పొందటమా లేదా జైలుకు వెళ్లటమా అనే పరిస్థితి నెలకొంది. తమ దృష్టికి రావడంతో ఓ నిఘా విభాగం అధికారులు ఈ కేసుపై తాజాగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అయితే ఓ కేసు విషయంలో పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరు ప్రస్తుతం చర్చనీయమైంది.