ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
- పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో దాడులు
- రూ.80 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
- రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సబ్ రిజిస్ట్రార్
- ఏసీబీ అధికారుల అదుపులో ప్రైవేటు వ్యక్తి కూడా
- పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కరప్షన్ పై ఇటీవల 'అక్షర దర్బార్' లో వరస కథనాలు
ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్
అక్షర దర్బార్, పరకాల: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రధానంగా కరప్షన్కు కేరాఫ్ గా మారిన వివిధ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాడులు జరిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతరాంపురంకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.80 వేల లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ సునీతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆమె లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తి నరేశ్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ సునీతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తి అజయ్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ సునీత పెద్ద మొత్తంలో ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నట్లు, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల పరకాల సబ్ రిజిస్టార్ కార్యాలయంపై 'అక్షర దర్బార్' పత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేటు వ్యక్తి నరేశ్ ఏసీబీ వలకు చిక్కడం చర్చనీయాంశమైంది.