ధడేల్.. ధడేల్
ధడేల్.. ధడేల్
* రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా
* నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా దందా
* అధికారుల అండతో బరితెగింపు..
* ఇష్టారాజ్యంగా మందుగుండుతో పేళుల్లు..
* మాయమవుతున్న గుట్టలు..
* యథేచ్చగా ప్రకృతి సంపద దోపిడీ..
* గతంలో మైనింగ్ సర్వే పేరుతో ఐదు లక్షలు నొక్కేసిన అధికారులు !
* ఎమ్మెల్యే జీఎస్సార్ ఆదేశాలు భేఖాతర్..
* ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
- అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్
అక్షర దర్బార్, శాయంపేట : మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకెళ్తోంది. దీంతో క్రమక్రమంగా గుట్టలు మాయమైపోతున్నాయి. శాయంపేట మండలంలో కొందరు బడా వ్యక్తులు మైనింగ్ మాఫియాను నడిపిస్తున్నారు. తూతూమంత్రంగా అనుమతులు పొంది అక్రమంగా గుట్టలను మింగుతున్నారు. మరికొందరు లీజు గడువు ముగిసినప్పటికీ అధికారులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా శాయంపేట మండలంలో 'ప్రగతి' కోసం పేరు మారిన వాగు అవతల గల గ్రామంలోని ఓ క్రషర్ నిర్వాహకులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే
ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్టపై నుండి 120 ఫీట్ల లోపల మందుగుండు సామాగ్రి అమర్చి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారని చెబుతున్నారు. బోర్ బ్లాస్టింగ్ వల్ల పెద్ద పెద్ద శబ్దంతో దుమ్ముధూళి అంతా ఇళ్లల్లోకి చేరుతోందని వాపోతున్నారు. బ్లాస్టింగ్ వాళ్ళ ఇళ్ల గోడలకు పగల్లు ఏర్పడుతున్నాయని, ఇంటిపై రేకులు పగిలిపోతున్నాయని స్థానికులు
ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. క్రషర్ యజమాని దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.
గుట్ట నుంచి కంకర గ్రానైట్ తవ్వకాల కోసం రెవెన్యూశాఖ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ ఓ సి), భూగర్భ గనుల (మైనింగ్) శాఖ నుంచి లీజు పత్రంతోపాటు పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్) నుంచి కన్సల్ట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ (సీఎఫ్ ఓ) అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ సదరు క్రషర్ నిర్వాహకులకు ఎలాంటి అనుమతులు లేవని సమాచారం. అంతేగాక మైనింగ్ చేయడానికి ఐదు హెక్టార్లకు మించితే స్థానికుల అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది. ఇవేమీ లేకుండా పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమన్వయంతో క్రషర్‌కు సహకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
- రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్
బ్లాస్టింగ్ చేయాలంటే మైనింగ్, పోలీసుల అనుమతితో పాటు స్థానిక ప్రజల ఇల్లు తదితర వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సదరు క్రషర్కు ఎలాంటి అనుమతులు లేకుండానే కంప్రెషర్ తో బ్లాస్టింగ్ చేస్తున్నారని పేలుడు ధాటికి ఇల్లు కంపించడంతోపాటు నెర్రలు బారుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా గుట్టలో బ్లాస్టింగ్ జరుగుతుండడంతో పొలాలకు వెళ్లే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక సదరు క్రషర్ నుండి నిబంధనలకు విరుద్ధంగా కంకర, డస్ట్ అంతా టన్నుల కొద్ది తరలిపోతున్నది. నిత్యం వందలాది టిప్పర్లతో వచ్చే దుమ్ముతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని రోడ్లు కూడా ధ్వంసం అవుపోతున్నదని స్థానికులు చెబుతున్నారు.
- ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్
భూపాపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదేశాలను అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన మండలంలోని క్రషర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మండలంలో మైనింగ్ అంతా దుర్వినియోగం అవుతోందని, మైనింగ్ పై సర్వే చేయాలని అధికారులను ఆదేశించగా వారు క్రషర్ యజమానులతో ఐదు లక్షలతో డీల్ మాట్లాడుకుని కుమ్మక్కయ్యారని స్వయంగా ఎమ్మెల్యే ఆరోపించారు. క్రషర్ నుండి ఆదనపు మోతాదులో ట్రాక్టర్ టిప్పర్ వెళితే వాటిపై జరిమానా విధించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కానీ అధికారులు అవేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటం మండలంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.