ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
- పరాయి స్త్రీతో సహజీవనం ఫలితం
- కొమురవెల్లి ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ పై ఆరోపణలు
- విచారణ జరిపిన సిద్దిపేట సీపీ
- నివేదిక అందగానే వేటు వేసిన ఐజీ రంగనాథ్
పరాయి స్త్రీతో సహజీవనం కొనసాగిస్తున్న ఆరోపణలపై ఒక ఎస్సైతో పాటు కానిస్టేబుల్ సస్పెండ్
అక్షర దర్బార్, సిద్దిపేట:
పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురవెల్లి ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ -1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసారు.
వివరాల్లోకి వెళ్తే... కొమురవెల్లి ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా ఇతర మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఇరువురిపై ఆరోపణలు రావడంతో పాటు ఎస్సై నాగరాజు భార్య మానస తన పిల్లల కోసం కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఇది మీడియా మధ్యమాల్లో ప్రచారం కావడంతో ఈ సంఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపారు. నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఎస్సై, కానిస్టేబుల్ పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నందుకు ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ -1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.