నాన్ లేఅవుట్.. ఫుల్ బెనిఫిట్
- ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో నిబంధనలకు పాతర
- దర్జాగా నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు
- ప్రతిఫలంగా ప్లాట్ లెక్కన వసూళ్లు
- కొన్నిచోట్ల ఏకంగా బినామీల పేర ప్లాట్ల సొంతం
- రిజిస్ట్రేషన్ శాఖలో తమ రూటే సప'రేటు' అనే రీతిలో కొందరి తీరు
- అక్రమాలపై పరకాలలో ఆసక్తికర చర్చ
అక్షర దర్బార్, నిఘా విభాగం:
అక్రమార్జన కోసం పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని కొందరు తమ రూటే సప'రేట్' అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అందిన కాడికి దండుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. ప్లాట్లు, ఇండ్లు, లీజు, రెంట్, మార్టిగేజ్, ఇతర రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తున్నారు. తాము చేసే పనుల్లో కొన్నింటికి భారీ నజరాణాలు అందుకుంటున్నారు. నవ్విపోదురు గాక మాకేమిటి... అనే తరహాలో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ లలో పెద్ద మొత్తంలో ఆర్థిక లబ్ధి పొందుతున్నారు. నాన్ లేఅవుట్ ప్లాట్లలో విలువను బట్టి రేట్ ఫిక్స్ చేసి ప్లాట్ చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో ప్లాట్లు గల కొన్ని వెంచర్లలో ప్లాటు లెక్కన డబ్బు పుచ్చుకునే బదులు ఒక ప్లాట్ నే తమ బినామీ పేర రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ఉదంతాలు కూడా లేకపోలేదు. రెండు మూడు మండలాల్లోని ఇది జరిగినట్లు ప్రభుత్వ నిఘా విభాగాల దృష్టికి వచ్చినట్లు తెలిసింది. మొత్తానికి ఇక్కడ నాన్ లేఅవుట్.. ఫుల్ బెనిఫిట్ అనే నినాదంతో దందా నడుస్తున్నట్లు టాక్. ఇక కోర్టు కేసులో ఉన్న స్థలాలను సైతం ఇంటి నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ గావించి పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ గా ప్రయోజనం పొందారు. ఇవన్నీ కూడా ఆఫీసులో అన్నీ తానై వ్యవహరిస్తున్న అజేయుడు బాస్ అనుమతితో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ నిఘా విభాగాలకు ఫిర్యాదులు అందాయని తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా నాన్ లేఅవుట్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, అందులో నాలా కన్వర్షన్ జరిగిన ఒక డాక్యుమెంట్ భూమిని భాగాలుగా రిజిస్ట్రేషన్ చేశారనే ఆరోపణలపై కొద్దిరోజుల క్రితం వరంగల్ జిల్లాలో ఖిలా వరంగల్ ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలో పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో జరిగిన నాన్ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై చర్చ తెరపైకి వచ్చింది. ఇక్కడ జరిగిన నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ లపై ఈ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? ఉపేక్షిస్తారా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
- భారీగా వసూళ్లు
పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా వరంగల్ మహానగరం రోజురోజుకీ విస్తరిస్తుండటంతో ఈ కార్యాలయం పరిధిలోని దామెర, ఆత్మకూరు తదితర మండలాల్లో నూతనంగా వెంచర్లు వెలుస్తున్నాయి. రియాల్టర్లు కొందరు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి నాలా కన్వర్షన్ చేయడం ద్వారా వెంచర్లుగా తీర్చిదిద్దుతున్నారు. లేఅవుట్ చేయకుండానే ఈ వెంచర్లలోని నాన్ లేఅవుట్ ప్లాట్లను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం వీటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయితే రియల్టర్లు కొందరు తమ వెంచర్లలో నాన్ లేఅవుట్ ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తుల పేర రిజిస్ట్రేషన్ చేయించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. అంతా నేనే తీరు ప్రదర్శిస్తున్న అజేయుడితో డీల్ మాట్లాడుతున్నారు. అవగాహన కుదరగానే ఫ్లాట్ లెక్కన ముడుపులు ముట్టజెబుతూ నాను లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో ప్లాటుకు రూ.20 వేల నుంచి మొదలై ప్లాట్ విలువను బట్టి పెరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా ఈ దందాలో డబ్బు పెద్ద మొత్తంలో చేతులు మారుతుందనేది సమాచారం. దామెర మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో ఇది పలు వెంచర్లలో జరిగినట్లు తెలిసింది. ఆత్మకూరు మండలంలో కూడా ఒకటి రెండు గ్రామాల్లోనూ ఇదే జరిగినట్లు సమాచారం.
- ఏకంగా ప్లాట్ల కైవసం
నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో అన్నీ తానై వ్యవహరించిన వ్యక్తి బాస్ అనుమతితో కొన్ని వెంచర్లలో ప్లాట్లను పొంది బినామీల పేర రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ నాన్ లేఅవుట్ ప్లాట్లు గల కొన్ని పెద్ద వెంచర్లలో ఇది జరిగినట్లు సమాచారం. ఆయా వెంచర్ లోని నాన్ లేఅవుట్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తే ప్లాట్ లెక్కన సమర్పించుకునే ముడుపులకు బదులు అంత విలువచేసే ఓ ప్లాట్ ను రిజిస్ట్రేషన్ల విషయంలో శాఖలో తమకు సహకరించిన వారి బినామీల పేర సంబంధిత రియల్టర్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిసింది. దామెర, ఆత్మకూరు మండలాల్లో ఇది జరిగిందని ప్రభుత్వ నిఘా విభాగాలకు అందిన ఫిర్యాదులో ఉన్నట్లు సమాచారం. ఇలా బినామీల పేర ప్లాటు రిజిస్ట్రేషన్ జరిగిన వెంచర్లను కూడా అందులో పేర్కొన్నట్లు తెలిసింది. అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా పొందిన ఈ ఒక్కో ఫ్లాట్ విలువ రూ.లక్షల్లో ఉంటుందని సమాచారం. నాన్ లేఔట్ ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లు, వీటిని రిజిస్ట్రేషన్ చేసినందుకు చేతులు మారిన ముడుపులు, ఆమ్యామ్యాల కింద కొన్ని వెంచర్లలో ఏకంగా బినామీల పేర రిజిస్ట్రేషన్ జరిగిన ప్లాట్ల విషయమై తాజాగా నిఘా విభాగాలు తమ నెట్ వర్క్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ నిబంధనలకు భిన్నంగా జరిగిన నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయమై శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.