స్టడీ ఎంబీఏ... చేసేది సైబర్ నేరాలు
- సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పిస్తానని వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో రూ.45 లక్షలు వసూలు
- హనుమకొండలో పట్టుబడిన నిందితుడు
- రూ.2 లక్షలు స్వాధీనం... ఏసీపీ వెల్లడి
చదివింది ఎంబీఏ.. చేసేది సైబర్ నేరాలు
- సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు కల్పిస్తానని నిరుద్యోగుల నుంచి వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో రూ.45 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడి
అక్షర దర్బార్, హనుమకొండ:
సాఫ్ట్‌వేర్ ఉద్యోగవకాశాలు కల్పిస్తానంటూ రూ.లక్షల్లో నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సైబర్ నేరస్థుడిని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. అరెస్టయిన సైబర్ కేటుగాడు నుంచి సుమారు రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సైబర్ క్రైమ్ విభాగం ఏసీపీ విజయ్‌కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. అంద్రప్రదేశ్ ఏలూరు జిల్లా చట్రాయి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పొనగంటి సాయితేజ(28) ఎంబీఏ పట్టా అందుకున్నాడు. కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోవడంతో పాటు జల్సాలకు అలావాటు పడ్డాడు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. తనకన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో ఉద్యోగ అవకాశాలు కల్పించే కొన్ని వెబ్ సైట్లను వేదికగా ఎంచుకున్నాడు. ఈ వెబ్‌సైట్లలో తమ వివరాలను నమోదు చేసుకున్న నిరుద్యోగులకు సంబంధించిన సెల్‌ఫోన్ నంబర్లను సేకరించి సంబంధిత నిరుద్యోగులకు బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని వారి ఫోన్లకు సంక్షిప్త సమాచారం పంపించేవాడు. ఇలాంటి మేసేజ్‌లకు స్పందించే నిరుద్యోగుల నుంచి ఈ సైబర్ నేరగాడు ఇంటర్యూ, పరీక్షలు, ట్రైనింగ్ అంటూ రూ. లక్షల్లో డబ్బు వసూళ్ళకు పాల్పడేవాడు. ఇదే తరహాలో నిందితుడు సాయితేజ హనుమకొండ ప్రాంతంలోని ఓ నిరుద్యోగి నుంచి సూమారు రూ.3 లక్షలకు పైగా డబ్బు వసూలు చేసి ఫోన్ స్వీచ్ ఆఫ్ చేయడంతో ఖంగుతిన్న భాధితుడు తాను మోసపోయినట్లు గుర్తించి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు. తక్షణమే స్పందించి కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్స్ పోలీసులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందం సైబర్ నేరాలకు పాల్పడుతున్న నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూమారు 35 మంది నిరుద్యోగుల నుండి సూమారు రూ.45 లక్షలు వసూలు చేసినట్లుగా నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్ విభాగం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి అతి కొద్ది సమయంలో కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ విజయ్‌కుమార్, ఇన్ స్పెక్టర్ రవి, ఎస్సైలు శివ, చరణ్ కానిస్టేబుళ్లు ఆంజనేయులు, మహేందర్, రాజు, సంపత్‌లను పోలీస్ కమిషనర్ ఝా అభినందించారు.