ఎంజీఎంలో మహిళా ఉద్యోగిపై దాడి కేసు..
అక్షరదర్బార్, వరంగల్ : వరంగల్ ఎంజీఎంలో ఉద్యోగిని కొట్టి బలవంతంగా డబ్బులు లాక్కున్న కిలాడీ లేడీని మట్టెవాడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఏసీపీ నందిరాం నాయక్ అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బిల్ల సుమలత అనే మహిళ 15 సంవత్సరాల నుండి ఎంజీఎంలో ఔట్ సోర్సింగ్‌లో రెండు ఏళ్లుగా పేషెంట్ కేర్‌గా ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం విధులలో భాగంగా బయోమెట్రిక్ తంబ్ పెడుతుండగా ఆలకుంట రాజమ్మ సదరు ఉద్యోగి బిళ్ళ సుమలతను అడ్డుకొని రెండు లక్షల లంచం ఇవ్వాలని, ఈ జీవో తీసుకొచ్చింది తానేనని, రెండు లక్షల రూపాయలు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించింది. తన వెంట తెచ్చుకున్న చైన్‌తో సదరు ఉద్యోగిపై విచక్షణరహితంగా దాడి చేసింది. అంతేగాక ఆమె వద్ద గల పదివేల రూపాయలు లాక్కొని మొబైల్ ను ధ్వంసంచేసింది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. బిళ్ళ సుమలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలు ఆలకుంట రాజమ్మను అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి వెయ్యి రూపాయల నగదుతోపాటు చైన్ ను స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు పంపారు.